నీడగా సాగాలన్న చోట.. గోడగానే మారాలి.. శలభానివి కావల్సిన చోట.. ప్రమిదగానే వెలగాలి.. ప్రేమాలింగనాల కొలిమిలో.. అభిమానం అడుసుగా మారుతుంది.. కోరికల జిగినీ పరదాల మాటున.. నగిషీలు చెక్కిన గాయం.. కాష్మోరా లా నిద్ర లేస్తుంది స్రవించే పుండుని ముట్టుకోనేలేరు.. కిలికించితాల అలల మీద.. అహంకృత గరళ వస్త్రం కప్పుకుంటుంది.. ఇప్పుడు కొత్తగా ఏంటి?.. హృదయ పరిఛ్ఛేదన.. యుగాల నాటిది.. ఏ అభిజాత్యపు క్షణమో.. నిన్ను నిన్నుగానే చూడాలనుకొంటుంది.. ఒక్కొక్క సారి.. సన్యాసపు సహజీవనాలు.. ఎంత మధురంగా వుంటాయి!.. నిన్ను నువ్వు గెల్చుకున్న ప్రతి క్షణం.. ఒక మూలరాయి అవుతుంది.. పెను గాలికి కూలిన మాను ...... మనసు చచ్చిన మానవి! తేడా ఏముందని? దు:ఖపు మూలాల్ని వేరు పురుగు తొలుస్తూనే వుంది.. కీటక నాశని చల్లండి.. గుండె గాయం.. ఇంకా ఆరనే లేదు ! -పుట్ల హేమలత

Monday, November 22, 2010

రమ్మంటే చాలు గానీ....


                                                      


  దాశరధి  కృష్ణమాచార్యులు 1926—1987

'గజల్, మానవ హృదయం లోని సౌకుమార్యానికి ప్రతీక' అంటాడు దాశరధి .
         తెలుగు లో గజల్  ప్రక్రియ ని పరిచయం చేసిన వాడు , ప్రవేశ పెట్టిన వాడు దాశరధి.నిజానికి గజల్ పర్షియన్ , ఉర్దూ భాషలనుంచి ఆవిర్భవించింది.గజల్ ని భారత దేశానికి పరిచయం చేసిన వాడు అమీర్ ఖుస్రో .గోల్కొండ సుల్తాన్ కులీ కుతుబ్ షా
16 వ శతాబ్దం లో  దక్కనీ (deccan )భాష లో మొదటి గజల్ రాశాడు.హైదరాబాద్ నవాబులు దాన్ని బాగా ఆదరించారు.
             దాశరధి గారి మీద ఉర్దూ భాషా ప్రభావం బాల్యం నుంచీ వుంది.ఖమ్మం లో  విద్యార్ధి  దశ లో వున్నప్పుడు  జక్కీ సాహెబ్ గారు   దాశరధి కి  ఉర్దూ, ఫారసీల ను ,గజల్ ను   పరిచయం చేశాడు.ఆ ప్రభావమే పెద్దయ్యాక స్వతంత్రం గా తెలుగు లో గజల్ రాయటానికి  దారి తీసింది.
1966 లో  దాశరధి రాసిన 'రమ్మంటే చాలు గానీ ' గజల్ తెలుగులో తొలి గజల్.
దాశరధి తన స్వీయ చరిత్ర 'యాత్రాస్మృతి' లో గజల్ గురించి ఎన్నో విషయాలు చెప్పుకున్నారు.ఇప్పటి దాకా దాశరధి రాసిన 11 గజళ్ళు మాత్రమే అందుబాటులో వున్నాయి.
దాశరధి రాసిన ఈ గజల్ లో ని భావం - రసాత్మకంగా ...శృంగారాత్మకంగా  ఒకింత విషాదం గా  కూడా గోచరమవుతుంది.ప్రేయసి కోసం ఏమైనా చేసే తెగింపు కనిపిస్తుంది.రమ్మంటే చాలు ... రాజ్యాలైనా  వదిలేసి వస్తాను అంటాడు నాయకుడు. నీ చిన్ని నవ్వు కోసం ...ఏడేడు సాగరాలు...ఎన్నెన్నో పర్వతాలు
ఎంతెంత దూరమైనా....బ్రతుకంతా నడచిరానా...అనటం లో  ప్రియురాలి కోసం పడే తపన .. ఆర్ద్రత  సాహిత్యం లోనే కాదు , ఈ గాయకుడి పాటలో కూడా ప్రతిఫలించింది..
ఈ కింది వీడియో  లో   ఈ గజల్ ని  నాయకుడికి ఆపాదించి పాడారు. దాశరధి కూడా ఆ ఉద్దేశం లోనే రాసి వుంటారు. ఈ గజల్ విన్న కొందరు
"నీవున్న మేడ గదికి
నను చేరనీయరేమో /2 /
జలతారు చీర గట్టి /2 /
సిగపూలు  ముడిచి రానా "
అనే పంక్తుల పట్ల  కొన్ని సందేహాలను వెలిబుచ్చారు.నాయకుడు జలతారు చీరగట్టి , సిగ పూలు ముడుచుకొని రావటం ఏమిటి? దానికి బదులుగా 'సిగ పూలు ముడిచి రావా' అని వుండాలి అన్నారు.బహుశా ఈ ఉద్దేశం లోనే  ఈ క్రింది వీడియో లో కూడా 'సిగ పూలు ముడిచి రావా' అనే పాడారు. కానీ గజల్ లక్షణాలను బట్టి చూస్తే  -'సిగపూలు  ముడిచి రానా' అనేదే సరైనదనీ, నిన్ను  మేడ గదిలో బంధించి ఉంచారు కాబట్టి  - జలతారు చీర గట్టి , సిగ పూలు ముడుచుకొని   స్త్రీవేషం లో నీ దగ్గరకు రానా? అని నాయికని అడిగినట్టుగా భావిస్తున్నట్టు  డా//ఎండ్లూరి సుధాకర్ ఒక వ్యాసం లో రాశారు.
గజల్  పురుషుల కి మాత్రమే సొంతం కాదు కాబట్టి  ..  రస హృదయం , ప్రతిభ , రచనా నైపుణ్యం , సంగీతం ...  స్త్రీల  సొత్తు కాబట్టి  ఈ గజల్ నాయిక పక్షాన రాసి ఉండవచ్చేమో  దాశరధి  అనిపించింది  నాకు.ఎందుకంటే  చరిత్ర లో రాజ్యాలు ఏలిన రాణులు వున్నారు.తనదగ్గర పని వాడిని   ప్రేమించిన రాజకుమారి   'రజియా సుల్తానా'  గుర్తుకొస్తుంది ఈ సందర్భంగా .
'బేగం అఖ్తర్ ' నూర్జహాన్'  షబ్నం మజీద్   'పర్వీన్ సుల్తానా'  ఆషా  బోన్స్లే 'మీరా కుమార్ల గజల్స్   విన్నాక   కాదనగలరా ఎవరైనా?
ఈ గజల్ లో -    
'కనులందు మంచులాగ
కలలన్ని కరిగి పోగా /2 /
కావేరి వోలె పొంగి/ 2/
కన్నీరు  తుడిచి రానా'  అనే  షేర్ లో   'కావేరి' వోలె పొంగి ..... అంటాడు దాశరధి.
 మన దేశం లో సముద్రం పురుషుడికి, నదులన్నీ స్త్రీలకి..  ప్రతీకలు గా వున్నాయి.నదులు ప్రవహిస్తూ  చివరికి సముద్రం లో సంగమిస్తాయి.దాశరధి 'కావేరిని' ప్రతీక గా తీసుకోవటం వల్ల, వెంటనే మరో షేర్ లో -జలతారు చీర గట్టి - సిగపూలు  ముడిచి రానా ... అనటం వల్ల  ఈ గజల్ స్త్రీ పక్షాన రాశాడేమో  అనిపిస్తుంది.
దాశరధి రాసిన ఈ గజల్ ని పాడిన గాయకులు తమ సౌలభ్యం  కోసం  కొన్ని పదాలని తమకి అనుకూలంగా మలుచుకున్నారు.ఉదాహరణకి: పి.బి. శ్రీనివాస్ పాడిన పాట లో  'రమ్మంటే చాలు లేవే' అంటారు.


ఏది ఏమైనా -  నేనిక్కడ దాశరధి రాసిన మూల సాహిత్యాన్నే ఇస్తున్నాను.శ్రీ  పి .విజయకుమార్ సారధ్యం లో వెలువడ్డ 'వెల్లువ' సి.డి లోని ఈ గజల్   పి.ఏ. రాజు గారి  స్వరం నుంచి ఎంత శ్రావ్యంగా వెలువడిందో విని మీ అభిప్రాయం చెప్తారు కదా !

రమ్మంటే చాలు గానీ
రాజ్యాలు విడిచి రానా
నీ చిన్ని నవ్వు కోసం /2 /
స్వర్గాలు గడచి రానా...
రమ్మంటే చాలు గానీ

ఏడేడు సాగరాలు
ఎన్నెన్నో పర్వతాలు /2/
ఎంతెంత దూరమైనా/2 /
బ్రతుకంతా నడచిరానా
నీ చిన్ని నవ్వు కోసం /2/
రాజ్యాలు విడిచి రానా
రమ్మంటే చాలు గానీ....

కనులందు మంచులాగ
కలలన్ని కరిగి పోగా /2 /
కావేరి వోలె పొంగి/ 2/
కన్నీరు  తుడిచి రానా
నీ చిన్ని నవ్వు కోసం /2 /
రాజ్యాలు గడచి రానా
రమ్మంటే చాలు గానీ ....

నీవున్న మేడ గదికి
నను చేరనీయరేమో /2 /
జలతారు చీర గట్టి /2 /
సిగపూలు  ముడిచి రానా
నీ చిన్ని నవ్వు కోసం /2 /
రాజ్యాలు గడచి రానా...
రమ్మంటే చాలు గానీ ...


పగ బూని కరకు వారు
బంధించి ఉంచినారు /2/
ఏనాటికైనా గానీ /2 /
ఈ గోడ పొడిచి రానా
నీ చిన్ని నవ్వు కోసం /2 /
రాజ్యాలు గడచి రానా....
రమ్మంటే చాలు గానీ ....

                                    వీడియో తెర మీద క్లిక్ చేసి  ఫుల్ స్క్రీన్  లో చూడ వచ్చు.
-పుట్ల హేమలత

Tuesday, November 16, 2010

ట్రోజన్ హార్స్



కలలన్నీ కరిగి కన్నీరయ్యాక 
పాణి గ్రహణం అంటే
నువ్వు నాకు పట్టిన గ్రహణం
అని అర్ధమయ్యాక
ఇప్పుడు నా ఎలిజీ నేనే రాసుకుంటున్నా...... .

*          *             *
 ఇప్పుడు నా ముఖం
పగిలిన అద్దంలోని ప్రతిబింబం లా  వుంది
కళ్ళ మోటబావులకి
మోటార్లు పెట్టి తోడినా
ఖాళీ కాని కన్నీటి  బ్రతుకులు ...
కాటు వేసేందుకు
విష సర్పాలే కానక్కర్లేదు
ఖద్దరు తోలు కప్పుకున్న పులులైనా  కావచ్చు
ఖాకీ ముసుగులో క్రూర మృగమే కావచ్చు
*          *              *
స్త్రీ మూర్తుల పక్షాన
వెండితెర పై
కడివెడు కనీళ్ళు కుమ్మరిస్తే
గ్రీష్మం లో 'ఆమని' వచ్చిందనుకున్నాం  కానీ
మేకప్ చాటున బుసలు కొట్టే
పురుషహంకారపు  ధన  పిశాచుల్ని పసిగట్టలేక పోయాం

*             *             *
సాఫ్ట్ వేర్  సంబంధం అంటే
మనసు కూడా అంతే అనుకున్నాం
నా పుట్టింటి ఆస్తిని  
డాలర్ల చెట్టుని  చేసి  దులుపుకున్నాక
ఆ మృత వృక్షానికి
నన్ను ఎరువుగా మార్చే
నిలువెత్తు హార్డ్ వేర్  పరికరానివనుకోలేదు 
ఇప్పుడు మా అతివల బతుకులు
 అర్ధాంతరంగా 'హ్యంగ్'   అయ్యాకే తెలిసింది
వేల వేల 'ట్రోజన్ హార్స్' లు
సున్నితమైన మా బతుకు ఫైళ్ళను
సమూలంగా నాశనం చేసే పనికి శ్రీకారం చుట్టాయని

*                      *                              *

మొదటి సారి నిన్ను చూసినప్పుడు
క్యూపిడ్  ఆవహించిన
రసాధి దేవత వనుకున్నా
ఒక కరవాలాన్నీ -ఒక గొడ్డలినీ
ఒక కిరోసిన్ బాటిల్ నీ -ఒక అగ్గిపుల్లనీ
ఒక విష పాత్రనీ -ఒక ఉరి తాడునీ
ఒక బండ రాయినీ -ఒక యాసిడ్ సీసానీ
ఆలింగనం చేసుకున్న
ఆక్టోపస్ వి అనుకోలేదు
నేనిప్పుడు దుస్స్వప్నిక ను .......
ఈ కళ్ళకు కలలు రావు
ఘనీభవించిన ఘాతుక హృదయుడా !
అభిజాత్యపు గాఢ గందకికామ్లపు  వెల్లువలో
కరిగి కన్నీరైన కంటి రెటీనాలు
మనసు తెర పై
ఇంద్రధనస్సుల్ని  ప్రదర్శించ లేవు
అంతా తిమిర వర్ణం ..... 
నోరు తెరుచుకున్న మృత్యు కుహరం ..
 *                           *                      *

ఆడపిల్ల ...
అలజడి...
చీకటి...
శూన్యం...

 -పుట్ల హేమలత

8 .11 .2010 ఆంధ్రజ్యోతి దినపత్రిక ... సాహిత్య వేదిక ' వివిధ' సౌజన్యం తో...

Friday, November 5, 2010

తెలుగు బ్లాగర్స్ అందరికీ దీపావళి శుభాకాంక్షలు

Sunday, October 17, 2010

తెలుగు బ్లాగర్స్ అందరికి విజయ దశమి శుభాకాంక్షలు..

Thursday, October 7, 2010

దాగుడు మూతలు



    
ఏ అర్ధ రాత్రి లోనో 
హటాత్తుగా మేలుకుంటానా!
నువ్వు గుర్తొస్తావు                                                  
అలవాటుగా నీ కోసం   
గదిలోకెళ్ళి చూస్తాను
గోడలనిండా ఐశ్వర్యా రాయ్
తెరలు తెరలుగా పరిహసిస్తుంది.
నేను కోపంగా వెనుదిరుగుతానా!
కళ్ళ నిండా నీళ్ళతో  
తలుపు చాటున 
నీ కోసమే తను ...
 నేనిక్కడ 
నీ కోసం    అంగాలార్చుతూ వుంటాను...
నువ్వేమో రంగుల సీతాకోక చిలుకల్ని 
స్కార్ఫ్ గా ధరించి
ప్రకృతి అణువుకి కేంద్రకానివవుతావు    
ప్రపంచపు పీఠ  భూములపై               
స్నేహ వర్షానివై తొలకరిస్తుంటావు     
మనసు క్షేత్రాలపై 
చిన్ని మంచు బిందువై  ఆక్రమిస్తావు 
అదాటుగా అలా చూస్తానా!
నీ 'ఆత్మ' వాహనమెక్కి 
తూనీగవై భ్రమిస్తుంటావు 
పాశపు  ఉచ్చులు  బిగిద్దామనుకుంటాను
చేతిలోని చేప పిల్ల జారిపోతుంది 
తలనిండా 
వెన్నెల కణాలు  రాలుతుంటాయ్ 
అబ్బురంగా పైకి చూస్తానా!
చందమామని కొరుక్కు తింటూ నువ్వు...
సుధలు నిండిన నోటితో 
ఫక్కున నవ్వుతూ వెక్కిరిస్తావు 
చటుక్కున దోసిలి నిండుతుంది 
అమృతం ఉప్పగానూ ఉంటుందా? 
*  *   *    *    *    *
కలిసి నడుస్తున్న దారి 
అర్ధాంతరంగా
కొండ చిలువ నాలుకవుతుంది
గమ్యాలను వెతుక్కుంటూ 
అటు నువ్వూ...
ఇటు నేనూ...
ఆ రోజుకి  
చివరి ముద్దైనా తీసుకోకుండా....
(మానస కోసం.....) 
- పుట్ల హేమలత 
     
*ఆదివారం ఆంద్ర జ్యోతి  అనుబంధం లో  అచ్చయిన  ఈ కవిత హిందీలోకి  'आँख मिचौली' పేరు తో  అనువదించబడింది. 
తెలుగు మూలాన్ని కూడా ఇక్కడ పెట్టమని కొందరు మిత్రులు అడిగారు.
           

Wednesday, September 15, 2010

నేను రాసిన 'దాగుడుమూతలు' కవితని హిందీ కవి జి.పరమేశ్వర్  హిందీ లోకి అనువదించారు . 'తెలుగు కావ్య ప్రభ ' అనే హిందీ కవితాసంకలనం  లో  దీని ప్రచురించారు.


  *కవిత మీద క్లిక్ చేస్తే  అక్షరాలు  పెద్దగా కనబడతాయి.

మాంట్రియల్ బొటానికల్ గార్డెన్స్

185 ఎకరాల విస్తీర్ణం లో వున్న 'మాంట్రియల్  బొటానికల్ గార్డెన్'  కెనడా లో వుంది.
విద్యార్ధులకి,పర్యాటకులకి  కూడా విజ్ఞానాన్ని , వినోదాన్ని కల్గిస్తుంది.
 మొక్కలతో ఎన్ని కళా ఖండాల్ని రూపొందించారో చూడండి.










Saturday, September 11, 2010

మిత్రులందరికీ రంజాన్ శుభాకాంక్షలు ...


మిత్రులందరికీ రంజాన్ శుభాకాంక్షలు  ...


Friday, September 10, 2010

అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు !


-పుట్ల హేమలత

Wednesday, September 8, 2010

పిండాల బావి


అమ్మా!

నేను జీవ కణాన్నై నీ ఉదర గృహంలో అడుగు పెట్టినప్పుడు
నువ్వెంత సంబరపడ్డావో కదా?
ఎంత మంచి దానివమ్మ!
ఆడో!మగో! తెలియదు
ముక్కు మొగమైనా రూపు దిద్దుకోలేదు
ఎన్ని సార్లు బొజ్జ తడుముకుని
నన్ను నీ బతుకు లోకి స్వాగతించావో కదా!
వెచ్చని నీ గర్భ గుడిలో దైవం లా
నేనెంత భద్రంగా వున్నానో కదా!?
ఈ రోజు నాన్న ఏదో అన్నాడు
అశృ తరంగాల మధ్య
ఓటి పడవలా వున్నావు నువ్వు
మొదటి సారిగా నాకు భయంగా వుందమ్మా!
నాన్నకి నేనిష్టం లేదు
స్టాక్ మార్కెట్లో పతనమైన సెన్ సెక్స్
నాన్న ఆస్తికి ఆనకట్ట ఆమ్నియో సెంటిసిస్
అమ్మా! నీ మనసేంటో నాకు తెలుసు
నిద్రలో పక్కకి ఒత్తిగిలితే
నాకెక్కడ నొప్పి కలుగుతుందోనని
కంటి నిండా కమ్మటి నిద్రైనా పోకపోతివి
నీ తలపుల కొమ్మపై
తేనె పిట్టనై వాలినప్పుడు
అవ్యక్తానుభూతికి లోనైన
నీ అంతరంగాన్ని లోనుంచే చూశాను
నేనంటే నీకెందుకంత ఇష్టం?
అమ్మతనం ఇంత తీయగా వుంటుందా?
నేనూ అమ్మనై
నా పాపని ఇలాగే ప్రేమించాలనుందమ్మా!
మీ అమ్మ నిన్ను కడుపు లోనే చంపేసుంటే
ఇప్పుడు నాకు నీ ప్రేమ రుచి తెలిసేది కాదు
అమ్మమ్మ ఎంతో మంచిది కదమ్మ!
నీకు బతుకు నిచ్చి జీవన బంధాలు వేసింది
నీ మాతృత్వం కూడా నన్ను కాపాడలేదా?
నాన్న దూరమైతే
నీకు సమాజంలో గుర్తింపు లేదు
నేనుంటే
మీకు పున్నామ నరకం తప్పదు
నాన్నకి కొడుకు కావాలి
నీకు నాన్న కావాలి
ఎవరు చెప్పారమ్మా?
ఈ కంచికి చేరని పుక్కిటి పురాణాలు?
కానీ నీకో విషయం తెలుసా అమ్మా?
నాకూ ఓ మంచి చోటుందని?
అక్కడంతా నా వయసు ఆడ పిండాలే!
మొగ్గతొడగని అంగాలూ…………
లేత పాపల పుర్రెలు , ఎముకలూ…………….
చెదిరిన స్వప్నాలను కలగంటున్న కళ్ళ
లోగిళ్ళతో
నాకు స్వాగతం పలుకుతారు
అమ్మా………
నాకోసం ‘నయాఘడ్ లో’
పిండాల బావి కాచుకుని వుందిలేమ్మా!
( ఒరిస్సా – నయాఘడ్ పట్టణం లోని ఒక పాడుబడ్డ బావిలో నలభైకి పైగా ‘ఆడపిండాల’ను కనుగొన్నారన్న వార్త చదివాక)