నీడగా సాగాలన్న చోట.. గోడగానే మారాలి.. శలభానివి కావల్సిన చోట.. ప్రమిదగానే వెలగాలి.. ప్రేమాలింగనాల కొలిమిలో.. అభిమానం అడుసుగా మారుతుంది.. కోరికల జిగినీ పరదాల మాటున.. నగిషీలు చెక్కిన గాయం.. కాష్మోరా లా నిద్ర లేస్తుంది స్రవించే పుండుని ముట్టుకోనేలేరు.. కిలికించితాల అలల మీద.. అహంకృత గరళ వస్త్రం కప్పుకుంటుంది.. ఇప్పుడు కొత్తగా ఏంటి?.. హృదయ పరిఛ్ఛేదన.. యుగాల నాటిది.. ఏ అభిజాత్యపు క్షణమో.. నిన్ను నిన్నుగానే చూడాలనుకొంటుంది.. ఒక్కొక్క సారి.. సన్యాసపు సహజీవనాలు.. ఎంత మధురంగా వుంటాయి!.. నిన్ను నువ్వు గెల్చుకున్న ప్రతి క్షణం.. ఒక మూలరాయి అవుతుంది.. పెను గాలికి కూలిన మాను ...... మనసు చచ్చిన మానవి! తేడా ఏముందని? దు:ఖపు మూలాల్ని వేరు పురుగు తొలుస్తూనే వుంది.. కీటక నాశని చల్లండి.. గుండె గాయం.. ఇంకా ఆరనే లేదు ! -పుట్ల హేమలత

Tuesday, November 16, 2010

ట్రోజన్ హార్స్



కలలన్నీ కరిగి కన్నీరయ్యాక 
పాణి గ్రహణం అంటే
నువ్వు నాకు పట్టిన గ్రహణం
అని అర్ధమయ్యాక
ఇప్పుడు నా ఎలిజీ నేనే రాసుకుంటున్నా...... .

*          *             *
 ఇప్పుడు నా ముఖం
పగిలిన అద్దంలోని ప్రతిబింబం లా  వుంది
కళ్ళ మోటబావులకి
మోటార్లు పెట్టి తోడినా
ఖాళీ కాని కన్నీటి  బ్రతుకులు ...
కాటు వేసేందుకు
విష సర్పాలే కానక్కర్లేదు
ఖద్దరు తోలు కప్పుకున్న పులులైనా  కావచ్చు
ఖాకీ ముసుగులో క్రూర మృగమే కావచ్చు
*          *              *
స్త్రీ మూర్తుల పక్షాన
వెండితెర పై
కడివెడు కనీళ్ళు కుమ్మరిస్తే
గ్రీష్మం లో 'ఆమని' వచ్చిందనుకున్నాం  కానీ
మేకప్ చాటున బుసలు కొట్టే
పురుషహంకారపు  ధన  పిశాచుల్ని పసిగట్టలేక పోయాం

*             *             *
సాఫ్ట్ వేర్  సంబంధం అంటే
మనసు కూడా అంతే అనుకున్నాం
నా పుట్టింటి ఆస్తిని  
డాలర్ల చెట్టుని  చేసి  దులుపుకున్నాక
ఆ మృత వృక్షానికి
నన్ను ఎరువుగా మార్చే
నిలువెత్తు హార్డ్ వేర్  పరికరానివనుకోలేదు 
ఇప్పుడు మా అతివల బతుకులు
 అర్ధాంతరంగా 'హ్యంగ్'   అయ్యాకే తెలిసింది
వేల వేల 'ట్రోజన్ హార్స్' లు
సున్నితమైన మా బతుకు ఫైళ్ళను
సమూలంగా నాశనం చేసే పనికి శ్రీకారం చుట్టాయని

*                      *                              *

మొదటి సారి నిన్ను చూసినప్పుడు
క్యూపిడ్  ఆవహించిన
రసాధి దేవత వనుకున్నా
ఒక కరవాలాన్నీ -ఒక గొడ్డలినీ
ఒక కిరోసిన్ బాటిల్ నీ -ఒక అగ్గిపుల్లనీ
ఒక విష పాత్రనీ -ఒక ఉరి తాడునీ
ఒక బండ రాయినీ -ఒక యాసిడ్ సీసానీ
ఆలింగనం చేసుకున్న
ఆక్టోపస్ వి అనుకోలేదు
నేనిప్పుడు దుస్స్వప్నిక ను .......
ఈ కళ్ళకు కలలు రావు
ఘనీభవించిన ఘాతుక హృదయుడా !
అభిజాత్యపు గాఢ గందకికామ్లపు  వెల్లువలో
కరిగి కన్నీరైన కంటి రెటీనాలు
మనసు తెర పై
ఇంద్రధనస్సుల్ని  ప్రదర్శించ లేవు
అంతా తిమిర వర్ణం ..... 
నోరు తెరుచుకున్న మృత్యు కుహరం ..
 *                           *                      *

ఆడపిల్ల ...
అలజడి...
చీకటి...
శూన్యం...

 -పుట్ల హేమలత

8 .11 .2010 ఆంధ్రజ్యోతి దినపత్రిక ... సాహిత్య వేదిక ' వివిధ' సౌజన్యం తో...

3 comments:

Unknown said...

a great work of art,

రాకుమార said...

ఏయిర్ కవిసమ్మేళనంలో విన్న,
వివిధలో కన్న కవిత
విషాదమోహనంగానూ..
ఫోర్స్‌ఫుల్‌గాను ఉంది.

Dr.Geeta Madhavi Kala said...

హేమలత గారూ,
కవిత చాలా బావుంది. కంగ్రాట్స్-