నీడగా సాగాలన్న చోట.. గోడగానే మారాలి.. శలభానివి కావల్సిన చోట.. ప్రమిదగానే వెలగాలి.. ప్రేమాలింగనాల కొలిమిలో.. అభిమానం అడుసుగా మారుతుంది.. కోరికల జిగినీ పరదాల మాటున.. నగిషీలు చెక్కిన గాయం.. కాష్మోరా లా నిద్ర లేస్తుంది స్రవించే పుండుని ముట్టుకోనేలేరు.. కిలికించితాల అలల మీద.. అహంకృత గరళ వస్త్రం కప్పుకుంటుంది.. ఇప్పుడు కొత్తగా ఏంటి?.. హృదయ పరిఛ్ఛేదన.. యుగాల నాటిది.. ఏ అభిజాత్యపు క్షణమో.. నిన్ను నిన్నుగానే చూడాలనుకొంటుంది.. ఒక్కొక్క సారి.. సన్యాసపు సహజీవనాలు.. ఎంత మధురంగా వుంటాయి!.. నిన్ను నువ్వు గెల్చుకున్న ప్రతి క్షణం.. ఒక మూలరాయి అవుతుంది.. పెను గాలికి కూలిన మాను ...... మనసు చచ్చిన మానవి! తేడా ఏముందని? దు:ఖపు మూలాల్ని వేరు పురుగు తొలుస్తూనే వుంది.. కీటక నాశని చల్లండి.. గుండె గాయం.. ఇంకా ఆరనే లేదు ! -పుట్ల హేమలత

Saturday, September 12, 2009

పిండాల బావి

http://www.pranahita.org/2009/09/pimdaala-baavi/#comments

Wednesday, May 6, 2009

అమ్మ కోసం ఓ రోజు ............



నేను నిషేధించిన తల్లుల దినం

మళ్ళీ మళ్ళీ వస్తూనే వుంది

ఎండి మోడైన బంజరు

పెను ఉప్పెనకి ఉక్కిరి బిక్కిరైనట్టు

ఈ ఒక్క రోజూ

తల్లి ఉనికి చిగురిస్తుంది

హేపీ మదర్స్ డే 'మమ్మీ '....

వేల సంవత్సరాల కవచాల్ని చేధించుకుని

బతుకు పిరమిడ్ లోంచి

ఈ ఒక్క దినమే బయటికొస్తుంది

****************

ఏడాదిగా కనిపించని కొడుకుని

ప్రేమగా తల నిమురుదామనుకుంటే

అంతరాల రాతి గోడలా

కంప్యూటర్ స్క్రీన్‌ చేతికి తగులుతుంది

కొన్ని క్షణాల అనంతరం

ఇంటర్నెట్ కొడుకు అంతర్దానమవుతాడు

************************

మాతృత్వపు ముఖం మీది

వార్ధక్యపు ముడతల మెట్ల మీదుగా

అందలం ఎక్కిన చిట్టి తల్లి

ఇప్పుడు తల్లి తనాన్నే నిలదీస్తుంది

కడుపు తీపి సాక్షి గా

గాయపడ్డ తల్లి హృదయం

పిల్లల మరుగుజ్జు పెద్దరికం లో

శైశవత్వపు శకలాల కోసం

జీవిత కాలం వెతుక్కుంటూనే వుంటుంది

ఈ ఒక్క పూట మాత్రం

తనని మాతృ 'దేవతని 'చేసినందుకు

గుండె కేకు ని ముక్కలు చేసి

ప్రేమగా పిల్లలకి పంచి పెడుతుంది

తల్లి మీది ప్రేమ కర్టెసీగా మారినా

లౌక్యం తెలియని పిచ్చితల్లి

మళ్ళీ నత్తలా

అమ్మతనం లోకి దూరిపోతుంది

నేను నిషేధించిన ఈ దినం

మళ్ళీ మళ్ళీ వస్తూనే వుంది

తల్లిని తూట్లు పొడిచి పోతూనే వుంది.........


-హేమలత పుట్ల



Monday, April 6, 2009

జ్ఞాపకాల తెరలు



చిన్నప్పుడు నిద్దట్లో

అమ్మ కప్పిన పైట కొంగు వెచ్చదనం

ఒక జ్ఞాపకమై

నా భుజాల చుట్టూ

శాలువాగా చుట్టుకుంటుంది

మూర్తీభవించిన యక్షిణి లా

ఆమె ఎక్కడో వుంటుంది

నేను మాత్రం

తియ్యటి పలకరింపుల మాధుర్యాన్ని

జ్ఞాపకాల బైనాక్యులర్స్ లోంచి చూస్తుంటాను

గుండె గాలి పటమై

చెట్టూ కొమ్మల్లో రప రప మంటున్నప్పుడు

బ్రతుకు భుజమ్మీద

పసి పాప నై జారిపోతున్నప్పుడు

ఒక పిల్ల తెమ్మెరలా

అమ్మ నన్ను వీపు నిమురుతుంది

అప్పుడు పాల బువ్వలు తినిపించిన

అరిటాకు చేతులు

సుఖ దు:ఖాల గోడలను కట్టీ కట్టీ

రాటు దేలిన ఆకు రాళ్ళవుతున్నాయి

అప్పుడప్పుడూ

గుండె గుభిల్లున జారి

ఇంటి పెరట్లో బాదం కాయలా రాలి పడుతుంది

ప్రేమ పలకరింపులు

పురాతన అవశేషాలై

తుప్పు పట్టి చూరు కింద పడుంటాయి

గాట్లు పడిన హృదయానికి

మాసికలు వేసీ వేసీ విసిగి పోతున్నప్పుడు

ఒక అస్పష్ట భావమేదో

నన్ను నిలువెల్లా తూర్పార బడుతుంది

ఇప్పుడు నేను

సమూహం లో ఏకాకినై

శూన్యపు రెక్కల కింద

పిల్ల కాకినై ఒదిగి పోతుంటాను

ఒక్క అమ్మ మాత్రమే

నన్ను మనిషిని చేసి

జీవిత రహ దారిని చూపుతుంది

నేను తప్పటడుగు లేస్తూ

అమ్మ చిటికిన వేలు పట్టుకుని

జీవన రేఖల సరిహద్దులు

కొలత వేస్తుంటాను.


-పుట్ల హేమలత

('నీలి మేఘాలు'స్త్రీవాద కవితా సంకలనం నుంచి)

Sunday, March 8, 2009

happy women's day!!!!


Happy Women's Day - More bloopers are a click away

Saturday, March 7, 2009

అంతర్జాతీయ మహిళా దినోత్సవం



నిన్నటి దాకా

అణిచి వేయబడ్డాను

ఇవాళ నేను

అంతర్జాతీయమయ్యాను

నేను మానవి ని!

నన్ను నేను కనుగొన్న కొత్త దీవిని ...

నేనొక కొత్త దీపాన్ని ...

నేనొక కొత్త రూపాన్ని...

నేనిప్పుడు కొత్త మహిళను!

ఆరని జ్వాలను!!


-పుట్ల హేమలత

Tuesday, January 20, 2009

అసలు సంక్రాంతి

ఆ మధ్య మాకు తెలిసినావిడ బజార్లో కలిస్తే' సంక్రాంతి పనులు పూర్తి అయ్యాయా?ఎప్పుడూ అట్టహాసంగా చేస్తారు కదా!మీ ఆడ బడుచు ఎలా వుందీ?అప్పుడెప్పుడో ఆర్ధికంగా బాగా చితికి పోయారు అన్నారు కదా?' అనడిగాను.
'అదెందుకు అడుగుతారులెండి.ఆ భారమంతా ఇప్పుడు నా నెత్తికొచ్చి పడింది.ఇదిగో వారం ముందే పిల్లా జెల్లా తో వచ్చి నా మీద వాలి పోయారు.మాతో బాటూ సమానంగా అన్నీ సమకూర్చొద్దా?మా వారు దగ్గరుండి మరీ తీసుకొ్చ్చారు.చేసే వాళ్ళకి తెలుస్తుంది ' అంది నిష్టూరంగా.
నిజానికి ఆమెకి డబ్బుకి తక్కువ లేదు.ఆమె ఆడబడుచు ఆమెకి పరాయిదీ కాదు.పని సంగతా?ఇంటి నిండా పని వాళ్ళు.......
'దేనికైనా మనసుండాలి కదా?' అనుకుంటూ ఇంటికొచ్చాను.
సంక్రాంతి రోజు అనుకోకుండా ఆన్ లైన్ లో ఒక అమెరికా స్నేహితురాలితో మాట్లాడాను.'సంక్రాంతి శుభాకాంక్షలు ! ఎలా జరుపుకున్నారు పండుగ ?' అని అడిగాను.
అవీ ఇవీ మాట్లాడుకున్నాక ఆమె ఇలా చెప్పింది.
'ఏముంది?ఒక పేద వృద్దురాలికి కొంత ఆర్దిక సాయం చేసాను.ఇండియా లోని ఒక ధార్మిక సంస్థ కి అయిదువేల రూపాయలు పంపాను.ఈ తృప్తి చాలదా ఈ సంక్రాంతికి ?"అంది .
'అబ్బ ఎంత గొప్ప పండగ! దేనికైనా మనసుండాలి .'అనుకున్నాను మళ్ళీ.

-హేమలత పుట్ల

Thursday, January 8, 2009

స్మృత్యంజలి

స్మైల్' ...ఖాళీ సీసాలు మృత్యు మధువుతో నింపి ఆకాశ చషకం లో ఆఖరి 'చుక్క'య్యాడు. జ్వాలాముఖి 'జై దిగంబరా నేనే పైగంబరా' అని నినాదాలిచ్చుకుంటూ తనకు తానే జోహార్లర్పిం చుకున్నాడు .
మన 'స్వస్థాన మిత్రుడు' కొత్తపల్లి అక్షరాల అంతరిక్షాల్లోకి వెలుతురుపిట్టలా ఎగిరి పోయాడు.
తెలుగిస్లాం పండితుడు... జనాబ్ ఖాద్రి .అల్లా కు ప్యారే అయ్యాడు.ఆయన స్థాయి గీటు రాయి .
తెలుగు సాహిత్యం లో నిలువెత్తు దివిటీలైన ఈ కళా మూర్తుల కాంతి కనుమరుగయింది.ఈ వెలితిని పూర్తి చెయ్యటానికి ఎన్ని కాంతి సంవత్సరాలు కావాలో !?
అయినా మృతియె లేకున్న రుచి యేది బ్రతుకులోన?!
పుట్ల హేమలత