నీడగా సాగాలన్న చోట.. గోడగానే మారాలి.. శలభానివి కావల్సిన చోట.. ప్రమిదగానే వెలగాలి.. ప్రేమాలింగనాల కొలిమిలో.. అభిమానం అడుసుగా మారుతుంది.. కోరికల జిగినీ పరదాల మాటున.. నగిషీలు చెక్కిన గాయం.. కాష్మోరా లా నిద్ర లేస్తుంది స్రవించే పుండుని ముట్టుకోనేలేరు.. కిలికించితాల అలల మీద.. అహంకృత గరళ వస్త్రం కప్పుకుంటుంది.. ఇప్పుడు కొత్తగా ఏంటి?.. హృదయ పరిఛ్ఛేదన.. యుగాల నాటిది.. ఏ అభిజాత్యపు క్షణమో.. నిన్ను నిన్నుగానే చూడాలనుకొంటుంది.. ఒక్కొక్క సారి.. సన్యాసపు సహజీవనాలు.. ఎంత మధురంగా వుంటాయి!.. నిన్ను నువ్వు గెల్చుకున్న ప్రతి క్షణం.. ఒక మూలరాయి అవుతుంది.. పెను గాలికి కూలిన మాను ...... మనసు చచ్చిన మానవి! తేడా ఏముందని? దు:ఖపు మూలాల్ని వేరు పురుగు తొలుస్తూనే వుంది.. కీటక నాశని చల్లండి.. గుండె గాయం.. ఇంకా ఆరనే లేదు ! -పుట్ల హేమలత

Wednesday, September 8, 2010

పిండాల బావి


అమ్మా!

నేను జీవ కణాన్నై నీ ఉదర గృహంలో అడుగు పెట్టినప్పుడు
నువ్వెంత సంబరపడ్డావో కదా?
ఎంత మంచి దానివమ్మ!
ఆడో!మగో! తెలియదు
ముక్కు మొగమైనా రూపు దిద్దుకోలేదు
ఎన్ని సార్లు బొజ్జ తడుముకుని
నన్ను నీ బతుకు లోకి స్వాగతించావో కదా!
వెచ్చని నీ గర్భ గుడిలో దైవం లా
నేనెంత భద్రంగా వున్నానో కదా!?
ఈ రోజు నాన్న ఏదో అన్నాడు
అశృ తరంగాల మధ్య
ఓటి పడవలా వున్నావు నువ్వు
మొదటి సారిగా నాకు భయంగా వుందమ్మా!
నాన్నకి నేనిష్టం లేదు
స్టాక్ మార్కెట్లో పతనమైన సెన్ సెక్స్
నాన్న ఆస్తికి ఆనకట్ట ఆమ్నియో సెంటిసిస్
అమ్మా! నీ మనసేంటో నాకు తెలుసు
నిద్రలో పక్కకి ఒత్తిగిలితే
నాకెక్కడ నొప్పి కలుగుతుందోనని
కంటి నిండా కమ్మటి నిద్రైనా పోకపోతివి
నీ తలపుల కొమ్మపై
తేనె పిట్టనై వాలినప్పుడు
అవ్యక్తానుభూతికి లోనైన
నీ అంతరంగాన్ని లోనుంచే చూశాను
నేనంటే నీకెందుకంత ఇష్టం?
అమ్మతనం ఇంత తీయగా వుంటుందా?
నేనూ అమ్మనై
నా పాపని ఇలాగే ప్రేమించాలనుందమ్మా!
మీ అమ్మ నిన్ను కడుపు లోనే చంపేసుంటే
ఇప్పుడు నాకు నీ ప్రేమ రుచి తెలిసేది కాదు
అమ్మమ్మ ఎంతో మంచిది కదమ్మ!
నీకు బతుకు నిచ్చి జీవన బంధాలు వేసింది
నీ మాతృత్వం కూడా నన్ను కాపాడలేదా?
నాన్న దూరమైతే
నీకు సమాజంలో గుర్తింపు లేదు
నేనుంటే
మీకు పున్నామ నరకం తప్పదు
నాన్నకి కొడుకు కావాలి
నీకు నాన్న కావాలి
ఎవరు చెప్పారమ్మా?
ఈ కంచికి చేరని పుక్కిటి పురాణాలు?
కానీ నీకో విషయం తెలుసా అమ్మా?
నాకూ ఓ మంచి చోటుందని?
అక్కడంతా నా వయసు ఆడ పిండాలే!
మొగ్గతొడగని అంగాలూ…………
లేత పాపల పుర్రెలు , ఎముకలూ…………….
చెదిరిన స్వప్నాలను కలగంటున్న కళ్ళ
లోగిళ్ళతో
నాకు స్వాగతం పలుకుతారు
అమ్మా………
నాకోసం ‘నయాఘడ్ లో’
పిండాల బావి కాచుకుని వుందిలేమ్మా!
( ఒరిస్సా – నయాఘడ్ పట్టణం లోని ఒక పాడుబడ్డ బావిలో నలభైకి పైగా ‘ఆడపిండాల’ను కనుగొన్నారన్న వార్త చదివాక)

2 comments:

prashanth said...

కవిత చదువుతుంటే కన్నీళ్లు ఆగటం లేదు.ఈ రోజుల్లో ఇలా కూడా వున్నారా?
-ప్రశాంత్

Archana said...

ఎంత గొప్పగా రాసారండి!.. హృదయాన్ని పిండేసే వాస్తవానికి అద్దం పట్టింది మీ కవిత. చదువుతున్నంత సేపూ ఎంత బాధగా ఉన్నా మళ్లీ చదవాలనిపించే కవితలోని మీ భావ వ్యక్తీకరణ. hats off to you, హేమ గారు ...
ఉమాభారతి