దాశరధి కృష్ణమాచార్యులు 1926—1987
'గజల్, మానవ హృదయం లోని సౌకుమార్యానికి ప్రతీక' అంటాడు దాశరధి .
తెలుగు లో గజల్ ప్రక్రియ ని పరిచయం చేసిన వాడు , ప్రవేశ పెట్టిన వాడు దాశరధి.నిజానికి గజల్ పర్షియన్ , ఉర్దూ భాషలనుంచి ఆవిర్భవించింది.గజల్ ని భారత దేశానికి పరిచయం చేసిన వాడు అమీర్ ఖుస్రో .గోల్కొండ సుల్తాన్ కులీ కుతుబ్ షా16 వ శతాబ్దం లో దక్కనీ (deccan )భాష లో మొదటి గజల్ రాశాడు.హైదరాబాద్ నవాబులు దాన్ని బాగా ఆదరించారు.
దాశరధి గారి మీద ఉర్దూ భాషా ప్రభావం బాల్యం నుంచీ వుంది.ఖమ్మం లో విద్యార్ధి దశ లో వున్నప్పుడు జక్కీ సాహెబ్ గారు దాశరధి కి ఉర్దూ, ఫారసీల ను ,గజల్ ను పరిచయం చేశాడు.ఆ ప్రభావమే పెద్దయ్యాక స్వతంత్రం గా తెలుగు లో గజల్ రాయటానికి దారి తీసింది.
1966 లో దాశరధి రాసిన 'రమ్మంటే చాలు గానీ ' గజల్ తెలుగులో తొలి గజల్.
దాశరధి తన స్వీయ చరిత్ర 'యాత్రాస్మృతి' లో గజల్ గురించి ఎన్నో విషయాలు చెప్పుకున్నారు.ఇప్పటి దాకా దాశరధి రాసిన 11 గజళ్ళు మాత్రమే అందుబాటులో వున్నాయి.
దాశరధి రాసిన ఈ గజల్ లో ని భావం - రసాత్మకంగా ...శృంగారాత్మకంగా ఒకింత విషాదం గా కూడా గోచరమవుతుంది.ప్రేయసి కోసం ఏమైనా చేసే తెగింపు కనిపిస్తుంది.రమ్మంటే చాలు ... రాజ్యాలైనా వదిలేసి వస్తాను అంటాడు నాయకుడు. నీ చిన్ని నవ్వు కోసం ...ఏడేడు సాగరాలు...ఎన్నెన్నో పర్వతాలు
ఎంతెంత దూరమైనా....బ్రతుకంతా నడచిరానా...అనటం లో ప్రియురాలి కోసం పడే తపన .. ఆర్ద్రత సాహిత్యం లోనే కాదు , ఈ గాయకుడి పాటలో కూడా ప్రతిఫలించింది..
ఈ కింది వీడియో లో ఈ గజల్ ని నాయకుడికి ఆపాదించి పాడారు. దాశరధి కూడా ఆ ఉద్దేశం లోనే రాసి వుంటారు. ఈ గజల్ విన్న కొందరు
"నీవున్న మేడ గదికి
నను చేరనీయరేమో /2 /
జలతారు చీర గట్టి /2 /
సిగపూలు ముడిచి రానా "
అనే పంక్తుల పట్ల కొన్ని సందేహాలను వెలిబుచ్చారు.నాయకుడు జలతారు చీరగట్టి , సిగ పూలు ముడుచుకొని రావటం ఏమిటి? దానికి బదులుగా 'సిగ పూలు ముడిచి రావా' అని వుండాలి అన్నారు.బహుశా ఈ ఉద్దేశం లోనే ఈ క్రింది వీడియో లో కూడా 'సిగ పూలు ముడిచి రావా' అనే పాడారు. కానీ గజల్ లక్షణాలను బట్టి చూస్తే -'సిగపూలు ముడిచి రానా' అనేదే సరైనదనీ, నిన్ను మేడ గదిలో బంధించి ఉంచారు కాబట్టి - జలతారు చీర గట్టి , సిగ పూలు ముడుచుకొని స్త్రీవేషం లో నీ దగ్గరకు రానా? అని నాయికని అడిగినట్టుగా భావిస్తున్నట్టు డా//ఎండ్లూరి సుధాకర్ ఒక వ్యాసం లో రాశారు.
గజల్ పురుషుల కి మాత్రమే సొంతం కాదు కాబట్టి .. రస హృదయం , ప్రతిభ , రచనా నైపుణ్యం , సంగీతం ... స్త్రీల సొత్తు కాబట్టి ఈ గజల్ నాయిక పక్షాన రాసి ఉండవచ్చేమో దాశరధి అనిపించింది నాకు.ఎందుకంటే చరిత్ర లో రాజ్యాలు ఏలిన రాణులు వున్నారు.తనదగ్గర పని వాడిని ప్రేమించిన రాజకుమారి 'రజియా సుల్తానా' గుర్తుకొస్తుంది ఈ సందర్భంగా .
'బేగం అఖ్తర్ ' నూర్జహాన్' షబ్నం మజీద్ 'పర్వీన్ సుల్తానా' ఆషా బోన్స్లే 'మీరా కుమార్ల గజల్స్ విన్నాక కాదనగలరా ఎవరైనా?
ఈ గజల్ లో -
'కనులందు మంచులాగ
కలలన్ని కరిగి పోగా /2 /
కావేరి వోలె పొంగి/ 2/
కన్నీరు తుడిచి రానా' అనే షేర్ లో 'కావేరి' వోలె పొంగి ..... అంటాడు దాశరధి.
మన దేశం లో సముద్రం పురుషుడికి, నదులన్నీ స్త్రీలకి.. ప్రతీకలు గా వున్నాయి.నదులు ప్రవహిస్తూ చివరికి సముద్రం లో సంగమిస్తాయి.దాశరధి 'కావేరిని' ప్రతీక గా తీసుకోవటం వల్ల, వెంటనే మరో షేర్ లో -జలతారు చీర గట్టి - సిగపూలు ముడిచి రానా ... అనటం వల్ల ఈ గజల్ స్త్రీ పక్షాన రాశాడేమో అనిపిస్తుంది.
దాశరధి రాసిన ఈ గజల్ ని పాడిన గాయకులు తమ సౌలభ్యం కోసం కొన్ని పదాలని తమకి అనుకూలంగా మలుచుకున్నారు.ఉదాహరణకి: పి.బి. శ్రీనివాస్ పాడిన పాట లో 'రమ్మంటే చాలు లేవే' అంటారు.
ఏది ఏమైనా - నేనిక్కడ దాశరధి రాసిన మూల సాహిత్యాన్నే ఇస్తున్నాను.శ్రీ పి .విజయకుమార్ సారధ్యం లో వెలువడ్డ 'వెల్లువ' సి.డి లోని ఈ గజల్ పి.ఏ. రాజు గారి స్వరం నుంచి ఎంత శ్రావ్యంగా వెలువడిందో విని మీ అభిప్రాయం చెప్తారు కదా !
రమ్మంటే చాలు గానీ
రాజ్యాలు విడిచి రానా
నీ చిన్ని నవ్వు కోసం /2 /
స్వర్గాలు గడచి రానా...
రమ్మంటే చాలు గానీ
ఏడేడు సాగరాలు
ఎన్నెన్నో పర్వతాలు /2/
ఎంతెంత దూరమైనా/2 /
బ్రతుకంతా నడచిరానా
నీ చిన్ని నవ్వు కోసం /2/
రాజ్యాలు విడిచి రానా
రమ్మంటే చాలు గానీ....
కనులందు మంచులాగ
కలలన్ని కరిగి పోగా /2 /
కావేరి వోలె పొంగి/ 2/
కన్నీరు తుడిచి రానా
నీ చిన్ని నవ్వు కోసం /2 /
రాజ్యాలు గడచి రానా
రమ్మంటే చాలు గానీ ....
నీవున్న మేడ గదికి
నను చేరనీయరేమో /2 /
జలతారు చీర గట్టి /2 /
సిగపూలు ముడిచి రానా
నీ చిన్ని నవ్వు కోసం /2 /
రాజ్యాలు గడచి రానా...
రమ్మంటే చాలు గానీ ...
పగ బూని కరకు వారు
బంధించి ఉంచినారు /2/
ఏనాటికైనా గానీ /2 /
ఈ గోడ పొడిచి రానా
నీ చిన్ని నవ్వు కోసం /2 /
రాజ్యాలు గడచి రానా....
రమ్మంటే చాలు గానీ ....
-పుట్ల హేమలత