నీడగా సాగాలన్న చోట.. గోడగానే మారాలి.. శలభానివి కావల్సిన చోట.. ప్రమిదగానే వెలగాలి.. ప్రేమాలింగనాల కొలిమిలో.. అభిమానం అడుసుగా మారుతుంది.. కోరికల జిగినీ పరదాల మాటున.. నగిషీలు చెక్కిన గాయం.. కాష్మోరా లా నిద్ర లేస్తుంది స్రవించే పుండుని ముట్టుకోనేలేరు.. కిలికించితాల అలల మీద.. అహంకృత గరళ వస్త్రం కప్పుకుంటుంది.. ఇప్పుడు కొత్తగా ఏంటి?.. హృదయ పరిఛ్ఛేదన.. యుగాల నాటిది.. ఏ అభిజాత్యపు క్షణమో.. నిన్ను నిన్నుగానే చూడాలనుకొంటుంది.. ఒక్కొక్క సారి.. సన్యాసపు సహజీవనాలు.. ఎంత మధురంగా వుంటాయి!.. నిన్ను నువ్వు గెల్చుకున్న ప్రతి క్షణం.. ఒక మూలరాయి అవుతుంది.. పెను గాలికి కూలిన మాను ...... మనసు చచ్చిన మానవి! తేడా ఏముందని? దు:ఖపు మూలాల్ని వేరు పురుగు తొలుస్తూనే వుంది.. కీటక నాశని చల్లండి.. గుండె గాయం.. ఇంకా ఆరనే లేదు ! -పుట్ల హేమలత

Wednesday, May 6, 2009

అమ్మ కోసం ఓ రోజు ............



నేను నిషేధించిన తల్లుల దినం

మళ్ళీ మళ్ళీ వస్తూనే వుంది

ఎండి మోడైన బంజరు

పెను ఉప్పెనకి ఉక్కిరి బిక్కిరైనట్టు

ఈ ఒక్క రోజూ

తల్లి ఉనికి చిగురిస్తుంది

హేపీ మదర్స్ డే 'మమ్మీ '....

వేల సంవత్సరాల కవచాల్ని చేధించుకుని

బతుకు పిరమిడ్ లోంచి

ఈ ఒక్క దినమే బయటికొస్తుంది

****************

ఏడాదిగా కనిపించని కొడుకుని

ప్రేమగా తల నిమురుదామనుకుంటే

అంతరాల రాతి గోడలా

కంప్యూటర్ స్క్రీన్‌ చేతికి తగులుతుంది

కొన్ని క్షణాల అనంతరం

ఇంటర్నెట్ కొడుకు అంతర్దానమవుతాడు

************************

మాతృత్వపు ముఖం మీది

వార్ధక్యపు ముడతల మెట్ల మీదుగా

అందలం ఎక్కిన చిట్టి తల్లి

ఇప్పుడు తల్లి తనాన్నే నిలదీస్తుంది

కడుపు తీపి సాక్షి గా

గాయపడ్డ తల్లి హృదయం

పిల్లల మరుగుజ్జు పెద్దరికం లో

శైశవత్వపు శకలాల కోసం

జీవిత కాలం వెతుక్కుంటూనే వుంటుంది

ఈ ఒక్క పూట మాత్రం

తనని మాతృ 'దేవతని 'చేసినందుకు

గుండె కేకు ని ముక్కలు చేసి

ప్రేమగా పిల్లలకి పంచి పెడుతుంది

తల్లి మీది ప్రేమ కర్టెసీగా మారినా

లౌక్యం తెలియని పిచ్చితల్లి

మళ్ళీ నత్తలా

అమ్మతనం లోకి దూరిపోతుంది

నేను నిషేధించిన ఈ దినం

మళ్ళీ మళ్ళీ వస్తూనే వుంది

తల్లిని తూట్లు పొడిచి పోతూనే వుంది.........


-హేమలత పుట్ల



5 comments:

పరిమళం said...

"అంతరాల రాతి గోడలా
కంప్యూటర్ స్క్రీన్‌ చేతికి తగులుతుంది" అధ్బుతంగా రాశారండీ !ధన్యవాదాలండీ !

హరేఫల said...

మీ సంస్థ రాజమండ్రీ లో ఎక్కడ ఉంది? మేము రాజమండ్రీ లోనే ఉన్నాము.

Unknown said...

medam. Mother's day gurinchi maaru raasinadi chaala baagundi medam.

అరుణ్ కుమార్ ఆలూరి said...

chala baga rasarandi.. gundelotullonchi udbavinchina manchi kavitha..

ee mother's day, father's day lu mana samskruti kadu.. eppudu talidandrulato vunde nijamaina bharatiyulaki aa dinalu taddinaalu.. ammanannalakante dabbekuvaina manushulaki ave parama pavitra sudinalu..

mi nunchi marinni manchi manchikavithalni ashistunnam...!

తాతా రమేశ్ బాబు said...

కవిత్వాన్ని చదువుతున్న అనుభూతి కలిగించి నందుకు మప్పిదాలు
తాతా రమేశ్ బాబు
చూడండి నా బ్లాగు :తాతా రమేశ్.బ్లాగ్ స్పాట్.కాం