నీడగా సాగాలన్న చోట.. గోడగానే మారాలి.. శలభానివి కావల్సిన చోట.. ప్రమిదగానే వెలగాలి.. ప్రేమాలింగనాల కొలిమిలో.. అభిమానం అడుసుగా మారుతుంది.. కోరికల జిగినీ పరదాల మాటున.. నగిషీలు చెక్కిన గాయం.. కాష్మోరా లా నిద్ర లేస్తుంది స్రవించే పుండుని ముట్టుకోనేలేరు.. కిలికించితాల అలల మీద.. అహంకృత గరళ వస్త్రం కప్పుకుంటుంది.. ఇప్పుడు కొత్తగా ఏంటి?.. హృదయ పరిఛ్ఛేదన.. యుగాల నాటిది.. ఏ అభిజాత్యపు క్షణమో.. నిన్ను నిన్నుగానే చూడాలనుకొంటుంది.. ఒక్కొక్క సారి.. సన్యాసపు సహజీవనాలు.. ఎంత మధురంగా వుంటాయి!.. నిన్ను నువ్వు గెల్చుకున్న ప్రతి క్షణం.. ఒక మూలరాయి అవుతుంది.. పెను గాలికి కూలిన మాను ...... మనసు చచ్చిన మానవి! తేడా ఏముందని? దు:ఖపు మూలాల్ని వేరు పురుగు తొలుస్తూనే వుంది.. కీటక నాశని చల్లండి.. గుండె గాయం.. ఇంకా ఆరనే లేదు ! -పుట్ల హేమలత

Sunday, November 16, 2008

స్వప్న ముఖి

ఒత్తిగిలి హత్తుకోవటానికి
మరో రెండు చేతులుంటే
ఎంత బాగుణ్ణు
ఒక రెంటితో నిన్నూ.....
మరో రెంటితో మరో నిన్నూ.....

కనీసం
నాకు రెండు ముఖాలైనా లేవు
ఒకటి 'నీ' వెంపు కీ
మరొకటి
'మరో నీ' మెడ వంపు కీ .....

నా 'మానస' మహతి పై
నీ ప్రేమ తంత్రుల నాదం
నీ 'మనోజ్ఞ ' మధూలికల పరిమళాలు
నా తలపుల వాకిట్లో ......

వినటానికి రెండు చెవులేనా?
ఏరుకోవటానికి రెండు చేతులేనా?

అవయవాలకీ 'ధాత' కరువు

ఒక నీకూ
మరో నీకూ
ఇంకా తెలీదు
ఒకప్పుడు
మా అమ్మ కూడా ఇంతే
పది చేతుల కోసం
పంచముఖి యై
కలలు కంటూ వుండేది !

-పుట్ల హేమలత


జిగినీ పరదాలు


నీడగానే సాగాలన్న చోట

గోడగానే మారాలి

శలభానివి కావల్సిన చోట

ప్రమిదగానే వెలగాలి

ప్రేమాలింగనాల కొలిమిలో

అభిమానం అడుసుగా మారుతుంది

కోరికల జిగినీ పరదాల మాటున

నగిషీలు చెక్కిన గాయం

కాష్మోరా లా నిద్ర లేస్తుంది

స్రవించే పుండుని ముట్టుకోనేలేరు

వైతరణి ప్రవహిస్తేనేం?

సుగంధ భరితంగా వుండాలి కాబోలు

కిలికించితాల అలల మీద

అహంకృత గరళ వస్త్రం కప్పుకుంటుంది

ఇప్పుడు కొత్తగా ఏంటి?

హృదయ పరిఛ్ఛేదన

యుగాల నాటిది

ఏ అభిజాత్యపు క్షణమో

నిన్ను నిన్నుగానే చూడాలనుకొంటుంది

ఒక్కొక్క సారి

సన్యాసపు సహజీవనాలు

ఎంత మధురంగా వుంటాయి!

నిన్ను నువ్వు గెల్చుకున్న ప్రతి క్షణం

ఒక మూలరాయి అవుతుంది

పెను గాలికి కూలిన మాను ......

మనసు చచ్చిన మానవి!

తేడా ఏముందని?

దు:ఖపు మూలాల్ని

వేరు పురుగు తొలుస్తూనే వుంది

కీటక నాశని చల్లండి

గుండె గాయం

ఇంకా ఆరనే లేదు !


-పుట్ల హేమలత