Sunday, October 17, 2010
Thursday, October 7, 2010
దాగుడు మూతలు
ఏ అర్ధ రాత్రి లోనో
హటాత్తుగా మేలుకుంటానా!
నువ్వు గుర్తొస్తావు
అలవాటుగా నీ కోసం
గదిలోకెళ్ళి చూస్తాను
గోడలనిండా ఐశ్వర్యా రాయ్
తెరలు తెరలుగా పరిహసిస్తుంది.
నేను కోపంగా వెనుదిరుగుతానా!
కళ్ళ నిండా నీళ్ళతో
తలుపు చాటున
నీ కోసమే తను ...
నేనిక్కడ
నీ కోసం అంగాలార్చుతూ వుంటాను...
నువ్వేమో రంగుల సీతాకోక చిలుకల్ని
స్కార్ఫ్ గా ధరించి
ప్రకృతి అణువుకి కేంద్రకానివవుతావు
ప్రపంచపు పీఠ భూములపై
స్నేహ వర్షానివై తొలకరిస్తుంటావు
మనసు క్షేత్రాలపై
చిన్ని మంచు బిందువై ఆక్రమిస్తావు
అదాటుగా అలా చూస్తానా!
నీ 'ఆత్మ' వాహనమెక్కి
తూనీగవై భ్రమిస్తుంటావు
పాశపు ఉచ్చులు బిగిద్దామనుకుంటాను
చేతిలోని చేప పిల్ల జారిపోతుంది
తలనిండా
వెన్నెల కణాలు రాలుతుంటాయ్
అబ్బురంగా పైకి చూస్తానా!
చందమామని కొరుక్కు తింటూ నువ్వు...
సుధలు నిండిన నోటితో
ఫక్కున నవ్వుతూ వెక్కిరిస్తావు
చటుక్కున దోసిలి నిండుతుంది
అమృతం ఉప్పగానూ ఉంటుందా?
* * * * * *
కలిసి నడుస్తున్న దారి
అర్ధాంతరంగా
కొండ చిలువ నాలుకవుతుంది
గమ్యాలను వెతుక్కుంటూ
అటు నువ్వూ...
ఇటు నేనూ...
ఆ రోజుకి
చివరి ముద్దైనా తీసుకోకుండా....
(మానస కోసం.....)
- పుట్ల హేమలత
*ఆదివారం ఆంద్ర జ్యోతి అనుబంధం లో అచ్చయిన ఈ కవిత హిందీలోకి 'आँख मिचौली' పేరు తో అనువదించబడింది.
తెలుగు మూలాన్ని కూడా ఇక్కడ పెట్టమని కొందరు మిత్రులు అడిగారు.