నేను నిషేధించిన తల్లుల దినం
మళ్ళీ మళ్ళీ వస్తూనే వుంది
ఎండి మోడైన బంజరు
పెను ఉప్పెనకి ఉక్కిరి బిక్కిరైనట్టు
ఈ ఒక్క రోజూ
తల్లి ఉనికి చిగురిస్తుంది
హేపీ మదర్స్ డే 'మమ్మీ '....
వేల సంవత్సరాల కవచాల్ని చేధించుకుని
బతుకు పిరమిడ్ లోంచి
ఈ ఒక్క దినమే బయటికొస్తుంది
****************
ఏడాదిగా కనిపించని కొడుకుని
ప్రేమగా తల నిమురుదామనుకుంటే
అంతరాల రాతి గోడలా
కంప్యూటర్ స్క్రీన్ చేతికి తగులుతుంది
కొన్ని క్షణాల అనంతరం
ఇంటర్నెట్ కొడుకు అంతర్దానమవుతాడు
************************
మాతృత్వపు ముఖం మీది
వార్ధక్యపు ముడతల మెట్ల మీదుగా
అందలం ఎక్కిన చిట్టి తల్లి
ఇప్పుడు తల్లి తనాన్నే నిలదీస్తుంది
కడుపు తీపి సాక్షి గా
గాయపడ్డ తల్లి హృదయం
పిల్లల మరుగుజ్జు పెద్దరికం లో
శైశవత్వపు శకలాల కోసం
జీవిత కాలం వెతుక్కుంటూనే వుంటుంది
ఈ ఒక్క పూట మాత్రం
తనని మాతృ 'దేవతని 'చేసినందుకు
గుండె కేకు ని ముక్కలు చేసి
ప్రేమగా పిల్లలకి పంచి పెడుతుంది
తల్లి మీది ప్రేమ కర్టెసీగా మారినా
లౌక్యం తెలియని పిచ్చితల్లి
మళ్ళీ నత్తలా
అమ్మతనం లోకి దూరిపోతుంది
నేను నిషేధించిన ఈ దినం
మళ్ళీ మళ్ళీ వస్తూనే వుంది
తల్లిని తూట్లు పొడిచి పోతూనే వుంది.........
-హేమలత పుట్ల