నీడగా సాగాలన్న చోట.. గోడగానే మారాలి.. శలభానివి కావల్సిన చోట.. ప్రమిదగానే వెలగాలి.. ప్రేమాలింగనాల కొలిమిలో.. అభిమానం అడుసుగా మారుతుంది.. కోరికల జిగినీ పరదాల మాటున.. నగిషీలు చెక్కిన గాయం.. కాష్మోరా లా నిద్ర లేస్తుంది స్రవించే పుండుని ముట్టుకోనేలేరు.. కిలికించితాల అలల మీద.. అహంకృత గరళ వస్త్రం కప్పుకుంటుంది.. ఇప్పుడు కొత్తగా ఏంటి?.. హృదయ పరిఛ్ఛేదన.. యుగాల నాటిది.. ఏ అభిజాత్యపు క్షణమో.. నిన్ను నిన్నుగానే చూడాలనుకొంటుంది.. ఒక్కొక్క సారి.. సన్యాసపు సహజీవనాలు.. ఎంత మధురంగా వుంటాయి!.. నిన్ను నువ్వు గెల్చుకున్న ప్రతి క్షణం.. ఒక మూలరాయి అవుతుంది.. పెను గాలికి కూలిన మాను ...... మనసు చచ్చిన మానవి! తేడా ఏముందని? దు:ఖపు మూలాల్ని వేరు పురుగు తొలుస్తూనే వుంది.. కీటక నాశని చల్లండి.. గుండె గాయం.. ఇంకా ఆరనే లేదు ! -పుట్ల హేమలత

Monday, April 6, 2009

జ్ఞాపకాల తెరలు



చిన్నప్పుడు నిద్దట్లో

అమ్మ కప్పిన పైట కొంగు వెచ్చదనం

ఒక జ్ఞాపకమై

నా భుజాల చుట్టూ

శాలువాగా చుట్టుకుంటుంది

మూర్తీభవించిన యక్షిణి లా

ఆమె ఎక్కడో వుంటుంది

నేను మాత్రం

తియ్యటి పలకరింపుల మాధుర్యాన్ని

జ్ఞాపకాల బైనాక్యులర్స్ లోంచి చూస్తుంటాను

గుండె గాలి పటమై

చెట్టూ కొమ్మల్లో రప రప మంటున్నప్పుడు

బ్రతుకు భుజమ్మీద

పసి పాప నై జారిపోతున్నప్పుడు

ఒక పిల్ల తెమ్మెరలా

అమ్మ నన్ను వీపు నిమురుతుంది

అప్పుడు పాల బువ్వలు తినిపించిన

అరిటాకు చేతులు

సుఖ దు:ఖాల గోడలను కట్టీ కట్టీ

రాటు దేలిన ఆకు రాళ్ళవుతున్నాయి

అప్పుడప్పుడూ

గుండె గుభిల్లున జారి

ఇంటి పెరట్లో బాదం కాయలా రాలి పడుతుంది

ప్రేమ పలకరింపులు

పురాతన అవశేషాలై

తుప్పు పట్టి చూరు కింద పడుంటాయి

గాట్లు పడిన హృదయానికి

మాసికలు వేసీ వేసీ విసిగి పోతున్నప్పుడు

ఒక అస్పష్ట భావమేదో

నన్ను నిలువెల్లా తూర్పార బడుతుంది

ఇప్పుడు నేను

సమూహం లో ఏకాకినై

శూన్యపు రెక్కల కింద

పిల్ల కాకినై ఒదిగి పోతుంటాను

ఒక్క అమ్మ మాత్రమే

నన్ను మనిషిని చేసి

జీవిత రహ దారిని చూపుతుంది

నేను తప్పటడుగు లేస్తూ

అమ్మ చిటికిన వేలు పట్టుకుని

జీవన రేఖల సరిహద్దులు

కొలత వేస్తుంటాను.


-పుట్ల హేమలత

('నీలి మేఘాలు'స్త్రీవాద కవితా సంకలనం నుంచి)